దేశంలో కరోనా ఉధృతి... వైకాపా ఎంపీలకు పాజిటివ్

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (12:34 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ప్రజా ప్రతినిధులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవిలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వీరిద్దరినీ ఐసోలేషన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. తదుపరి రెండు వారాలూ వీరు ఢిల్లీలోనే ఉండి, చికిత్సను పొందనున్నారు.
 
అయితే, రెడ్డప్పకు ఎటువంటి లక్షణాలు కనిపించనప్పటికీ కరోనా సోకినట్టుగా తేలిందని తెలుస్తోంది. మాధవికి మాత్రం రెండు రోజులుగా జ్వరం ఉందని, జ్వరంతో బాధపడుతూనే ఆమె లోక్‌సభ సమావేశాల నిమిత్తం వచ్చి, పరీక్ష చేయించుకోగా, పాజిటివ్‍‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. 
 
ఇదిలావుండగా, కాకినాడ ఎంపీ వంగా గీతకు, శనివారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 24 మంది ఎంపీలు, 8 మంది కేంద్ర మంత్రులకు వైరస్ సోకింది. ఏ విధమైన కరోనా లక్షణాలు కనిపించినా, స్వల్ప లక్షణాలున్నా సభలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు.
 
మరోవైపు, దేశంలో క‌రోనా కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 48 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 92,071 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,46,428 కు చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 1,136 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 79,722కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 37,80,108  మంది కోలుకున్నారు. 9,86,598 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
 
కాగా, దేశంలో ఆదివారం వరకు మొత్తం 5,72,39,428 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,78,500 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు