నాకు కరోనా సోకింది... జయించి తిరిగి వస్తా : బుద్ధా వెంకన్న

శుక్రవారం, 28 ఆగస్టు 2020 (10:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ పది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ బారినపడిన వారిలో అనేక రాజకీయ ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా ఈ వైరస్ బారినపడ్డారు. 
 
కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యుల సూచనల మేరకు ఆయన ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. కొన్ని రోజుల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు.
 
'నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండమని డాక్టర్ సూచించారు. ఈ 14 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటాను. నాకు దైవసమానులైన మా అధినేత నారా చంద్రబాబు నాయుడు, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్‌ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను' అని బుద్ధా వెంకన్న తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు