ప్రకాశంలో 1000 - మహారాష్ట్రలో 2 లక్షల కరోనా పాజిటివ్ కేసులు

ఆదివారం, 5 జులై 2020 (10:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శనివారం కొత్తగా 41 మంది ఈ మహమ్మారి బారినపడటంతో జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,011కి పెరిగింది. కొత్తగా వెలుగుచూసిన కేసుల్లో అత్యధికంగా పామూరులో 12, చీరాలలో 11, ఒంగోలులో 6 నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 14 మంది కరోనాతో మరణించారు. 
 
అలాగే, ఇప్పటివరకు 87,613 నమూనాలను పరీక్షలకు పంపగా, 84,774 ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. 1,879 మంది ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 347 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 487 మంది ఇంకా క్వారంటైన్‌లో ఉన్నారు. 667 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
 
మరోవైపు, మహారాష్ట్రలో కరోనా కేసులు అంతుపొంతు లేకుండా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 7,074 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల మైలు రాయిని దాటేసి 2,00,064కు చేరుకుంది. రాష్ట్రంలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 
 
అలాగే, తాజాగా 295 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 8,671కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 83,295 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
 
ఇకపోతే, దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 24,850 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదేసమయంలో 613 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,73,165కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 19,268కి పెరిగింది. 2,44,814 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,09,083 మంది కోలుకున్నారు.
 
శనివారం వరకు దేశంలో మొత్తం 97,89,066 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,48,934 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు