మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా లెక్కల ప్రకారం భారత్‌లో ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 396కు చేరింది. జనతా కర్ఫ్యూ పాటించిన ఆదివారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 64 కేసులు నమోదయ్యాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 3,37,570గా ఉంది. భారత్‌లో ఏడుగురు మరణించగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 16,655గా ఉంది.
భారత్‌లో నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 74, కేరళలో 64, ఢిల్లీలో 30, రాజస్థాన్‌లో 28, తెలంగాణలో 27, ఉత్తరప్రదేశ్‌లో 27, కర్ణాటకలో 26, గుజరాత్‌లో 18, మధ్యప్రదేశ్‌లో 6, ఆంధ్రప్రదేశ్‌లో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా కరోనా వైరస్ ప్రభావిత 75 జిల్లాల్లో కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు.. రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాంఖండ్ రాష్ట్రాలు ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 192 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. కరోనా బాధితుల సంఖ్య 3,37,570 కాగా, 14,654 మంది మృతి చెందారు. ఈ వ్యాధి నుంచి 97,636 మంది రోగులు కోలుకున్నారు.
కరోనా వైరస్ ప్రభావం ఇటలీలో చాలా తీవ్రంగా ఉంది. ఇటలీలో ఆదివారం ఒక్కరోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 59,138 కేసులు నమోదు కాగా, ఆదివారం ఒక్కరోజే 5,560 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇటలీలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,476గా ఉంది.
కరోనా వైరస్‌తో చైనాలో 3,270, స్పెయిన్‌లో 1,772, ఇరాన్‌లో 1,685, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 419, యూకేలో 281, నెదర్లాండ్స్‌లో 179, దక్షిణ కొరియాలో 104, స్విట్జర్లాండ్‌లో 98, జర్మనీలో 94, బెల్జియంలో 75 మంది మృతి చెందారు.