కరోనా విజృంభణ.. మళ్లీ కోవిడ్ మార్గదర్శకాలు.. పెళ్ళిళ్లకు ఆ ఆంక్షలు తప్పనిసరి

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (16:48 IST)
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇదే సందర్భంలో మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ పలు రాష్ట్రాలు అప్రమత్తమై కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కూడా విధించాయి. దేశంలో నమోదైన 90శాతం కేసుల్లో ఎక్కువగా ఏడు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. 
 
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించడంతోపాటు కోవిడ్ మార్గదర్శకాలను కఠినతరం చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. పాల్ఘర్ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. 
 
కరోనా కట్టడికి పలు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఆదేశాలను జారీ చేశారు. పాల్ఘర్ జిల్లాలో వారాంతపు మార్కెట్లు, సామూహిక వివాహాలను నిషేధిస్తూ పాల్ఘర్ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో, జిల్లాలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా మార్కెట్లను, సామూహిక వివాహాలను నిషేధించినట్లు వెల్లడించారు. 
 
కోవిడ్ మార్గదర్శకాలను విస్మరించినా.. ఉల్లంఘించినా కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. వివాహా, శుభకార్యాలకు నిబంధనల ప్రకారం 50మందిని అనుమతిస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు