కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. గత యేడాది డిసెంబరు నెలలో పురుడు పోసుకున్న ఈ వైరస్... తొలుత చైనా దేశంలోని వుహాన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఆ తర్వాత చాపకింద నీరులా సుమారు 220 ప్రపంచ దేశాలకు వ్యాపించింది. అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ వంటి దేశాలు చివురుటాకులా వణికిపోయాయి. ఈ వైరస్ బాధిత దేశాల్లో భారత్ కూడా ఉంది.
అయితే, ఈ వైరస్ ఇప్పటివరకు కేవలం నోటి తుంపర్లు ద్వారా, వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుందని భావిస్తూ వచ్చారు. కానీ, ఇపుడు మరో నిజం బయటపడింది. గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని వందలాది పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు తెలిపారు.
ఈ మేరకు కరోనా వ్యాప్తిపై సిఫార్సులను సవరించాలని వారు కోరారు. తాజాగా, ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వోకు 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు లేఖ రాశారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి దగ్గు, తుమ్ములు, మాట్లాడేటప్పుడు వచ్చే తుంపరల నుంచి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే చెప్పింది.
కరోనా ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపరల పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు కొత్తగా గుర్తించారు. అయితే, కరోనా గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్న విషయానికి సంబంధించిన ఆధారాలు సరిగాలేవని డబ్ల్యూహెచ్‌వో అంటోంది.