దేశంలో కరోనా ఉధృతి : 21 దాటిన కరోనా కేసులు

ఆదివారం, 9 ఆగస్టు 2020 (11:05 IST)
దేశంలో కరోనా వైరస్ ఉధృతి విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 64,399 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 861 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 21,53,011కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 43,379కి పెరిగింది. 6,28,747  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 14,80,885 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,41,06,535 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 7,19,364  శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
 
మరోవైపు, తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ, పలువురు నేతలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. శనివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్ సోకగా, ఆపై తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మహమ్మారి బారిన పడ్డారు. 
 
ఆయనకు వైరస్ సోకగానే, హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. కాగా, కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 10 రోజుల క్రితం ఆయనకు వైరస్ సోకగా, నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు