ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెరాస నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓ ప్రతిపాదన తెచ్చారు. కరోనా వైరస్ విస్తారంగా వ్యాపిస్తున్నందున కొంతకాలం పాటు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను వాయిదావేయాలని కోరారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు.
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ, మాట్లాడిన ఆయన, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కరోనా ఫీవర్ నడుస్తోందని గుర్తు చేసిన ఆయన, ఆందోళన తగ్గేంతవరకూ టెస్టులు నిలిపివేయాలని కోరారు. బ్రీథింగ్ టెస్టుల్లో ఒకే స్ట్రాతో ఇద్దరు, ముగ్గురికి పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా ఈ పరీక్షలు నిలిపివేయాలని సూచించారు.
దీనిపై స్పందించిన హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాన్ని పరిశీలిస్తామని, అతి త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వారాంతాల్లో రాత్రిపూట డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. బ్రీతింగ్ స్ట్రా పెట్టి ఊదిస్తున్నా, ముందు ఊదిన వ్యక్తిలో కరోనా వైరస్ ఉంటే, అది ఆ తరువాత ఊదే వ్యక్తికి సోకే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రీత్ అనలైజర్లలోకి గాలిని ఊదేందుకు పలువురు వాహనదారులు నిరాకరిస్తూ, పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగుతున్న పరిస్థితి నెలకొంది.