కోవిడ్ థర్డ్ వేవ్ చాలా ప్రమాదకరంగా వుంటుంది: ఎస్బీఐ నివేదిక వార్నింగ్

బుధవారం, 2 జూన్ 2021 (19:04 IST)
కరోనా థర్డ్ వేవ్ చాలా ప్రమాదకరంగా వుంటుందని, ఐతే మరణాలు తక్కువగా ఉంటాయని ఎస్బిఐ నివేదిక వెల్లడించింది. గత కొన్ని వారాలుగా రోజువారీ కొత్త కోవిడ్ కేసులు క్షీణిస్తున్నాయి. భారతీయ జనాభాలో కేవలం 3.2 శాతం మందికి మాత్రమే టీకాలు వేయడం జరిగింది. మరోవైపు సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతోంది.
 
ఈ నేపధ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన పత్రం ప్రకారం, కరోనావైరస్ వ్యాధి మహమ్మారి థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా వుంటుందని పేర్కొంది. ఐతే దీనిని టీకాలు వేయడం, మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా తగ్గించవచ్చని తెలిపింది. భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, ఐదు పేజీల నివేదికలో, మహమ్మారితో దెబ్బతిన్న దేశాలలో థర్డ్ వేవ్ సగటు వ్యవధి 98 రోజులుగా తెలిపింది. అంతర్జాతీయంగా పరిశీలించిన క్రమంలో థర్డ్ వేవ్ తీవ్రత సెకండ్ వేవ్‌కి ఏమాత్రం తీసిపోదని హెచ్చరించింది.
 
అయినప్పటికీ, థర్డ్ వేవ్‌లో మనం సన్నద్ధంగా వుంటే తీవ్రమైన కేసుల రేటును తగ్గించగలమనీ, తక్కువ సంఖ్యలో మరణాలతో బయటపడవచ్చని" ఎస్బిఐ పరిశోధన పత్రంలో తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం, భారతదేశంలో సుమారు 1,62,000 మంది ప్రజలు మార్చి చివరి వరకు కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
 
రెండు నెలల్లో, మరణాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ, మొత్తం కోవిడ్-సంబంధిత మరణాల సంఖ్య 3,30,000 కు పెరిగింది. సెకండ్ వేవ్‌లో కోవిడ్ కేసుల్లో విపరీతమైన పెరుగుదల దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలను చిన్నాభిన్నం చేసింది. ఇది ఆసుపత్రులలో భారీ ఆక్సిజన్ కొరతకు దారితీసింది.
 
గత కొన్ని వారాలుగా రోజువారీ కొత్త కరోనావైరస్ కేసులు క్షీణిస్తున్న నేపధ్యంలో థర్డ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరించారు. ఇప్పటివరకు భారత జనాభాలో కేవలం 3.2 శాతం మందికి మాత్రమే పూర్తిగా టీకాలు వేయించారు. ఎస్బిఐ నివేదిక ప్రకారం, మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు, కఠినమైన టీకాలు థర్డ్ వేవ్ సమయంలో తీవ్రమైన కోవిడ్ కేసులు 20 శాతం నుండి ఐదు శాతానికి తగ్గించగలవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు