తిరుపతిలో డెల్టా వేరియంట్ కేసు, వారి వల్లే వచ్చిందా?

శుక్రవారం, 25 జూన్ 2021 (18:48 IST)
గత ఏప్రిల్ నెలలో ప్రారంభమైన కరోనా రెండవ దశ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది. తిరుపతిలో ప్రతినిత్యం 1300 మంది కేసులు నమోదయ్యాయి. అధికారులతో సహా అందరూ ఉరుకులు పరుగులే. ఇక ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేసింది కరోనా వైరస్. వైద్యులు, వైద్య సిబ్బంది రాత్రింబవళ్ళు కష్టపడి కరోనా తగ్గుముఖం పట్టించారు. ప్రస్తుతం కరోనా జిల్లా వ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది. 
 
తిరుపతిలో కూడా భారీగా కేసులు తగ్గిపోయాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఏప్రిల్ నెలలోనే ఈ డెల్టా ప్లస్ కేసులు తిరుపతికి వచ్చాయా..? డెల్టా ప్లస్ వల్ల కేసులు పెరిగాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తిరుపతి తిరుమలరెడ్డి నగర్‌కు చెందిన ఒక వ్యక్తికి ఏప్రిల్ నెలలో డెల్టా ప్లస్ కేసు నిర్థారణ అయినట్లు పరీక్షల్లో తేలింది. 
 
స్విమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తి డిశ్చార్జ్అయ్యాడు. వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వారంతా క్షేమంగా ఉన్నారు. డెల్టా వైరస్ ప్లస్ వల్ల ఒకరి నుంచి మరొకరికి క్షణాల్లో వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడవ దశ వస్తే ఎదుర్కోవడానికి సిద్థమంటున్నారు అధికారులు. రెండవ దశలోనే ఆక్సిజన్ సరఫరాలో లోటుపాట్లు జరగడంతో కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 
 
ఇక మూడవదశ వస్తే పరిస్థితి ఏంటి.. స్విమ్స్‌లో డెల్టాప్లస్ వేరియంట్ కలిగిన వ్యక్తికి చెందిన స్వాబ్స్‌ను హైదరాబాద్‌కు పంపడంతో అక్కడ నిర్థారణ అయ్యింది. డెల్టా వేరియంట్ నిర్థారణ పరీక్షలు హైదరాబాద్ లోనే ఉన్నాయి. ప్రస్తుతమున్న వైరస్ రెండు స్వైబ్స్ కలిగి ఉంటుంది. డెల్టా వేరియంట్ ప్లస్ నాలుగు స్వైబ్స్ కలిగి ఉంటుందని ఇది తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిరుపతికి డెల్టా ప్లస్ వేరియంట్ వచ్చి పోయిందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. 
 
అందుకే కేసులు విపరీతంగా పెరిగాయా.. మరణాల్లోను చిత్తూరు జిల్లా మొదటి స్థానంలోనే ఉంది. ప్రతినిత్యం పదిమంది చనిపోతున్నారు. కలెక్టర్ హరినారాయణ్, జెసి వీరబ్రహ్మం, రెవిన్యూ అధికారులు ఇటు వైద్య సిబ్బంది స్విమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ ఇటు రుయా ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది రాత్రింబవళ్ళు పనిచేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు. 
 
ఈ తరుణంలో రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైందని కేంద్రప్రభుత్వం హెచ్చరించడం.. అది తిరుపతిలో వచ్చిందని చెప్పడంతో అటు వైద్యులకు, ఇటు ఉన్నతాధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మూడవదశలో చిన్నపిల్లలకు వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడవ దశలో అధికారులు రంగం సిద్థం చేస్తున్నారు. మహారాష్ట్ర భక్తులను నిలువరించగలిగితే ఈ డెల్టా వేరియంట్ ప్లస్ రావని కొందరు అంటున్నారు. 
 
దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తి పక్కన ఉన్నా సులువుగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికైనా ప్రజలు మాస్కులు ధరించి వ్యాక్సినేషన్ వేయించుకుంటే కొంతవరకు వైరస్‌ను అరికట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశాఖామంత్రి ఆళ్ళనాని తిరుపతిలో కేసు నమోదైందని ఆలస్య ఘటనగా వెలుగుచూపారు. ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

వెబ్దునియా పై చదవండి