దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. అందుకే ఈ రాష్ట్రం నుంచి వచ్చే ప్రయాణికులు, వాహనాలపై పొరుగు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. అదేవిధంగా విదేశాల నుంచి కేరళలో అడుగుపెట్టే వారికి ఆర్టీ పీసీఆర్ టెస్టును తప్పనిసరి చేసింది. దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇలా చేయడం ప్రయాణికులపై అదనపు భారం వేయడమేనని ప్రయాణికులు గగ్గోలు పెడుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఓ లేఖ కూడా రాశారు.
ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారికి కేరళ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే వారికి వయసుతో సంబంధం లేకుండా ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి. అలాగే థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనా లక్షణాలు లేకుంటేనే విమానం ఎక్కేందుకు అనుమతిస్తున్నారు.
అలాగే, విమానం దిగిన తర్వాత సొంత ఖర్చుతో విమానాశ్రయంలో ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. దేశాల నుంచి వచ్చే వారికి ఈ నిబంధనలు కొంత ఇబ్బందిగా మారడంతో స్పందించిన కేరళ ప్రభుత్వం నిబంధనలు కొంత సడలించింది.