వణికించిన డెల్టా వేరియంట్.. భారత్‌లో బి.1.617 రకం

ఆదివారం, 13 జూన్ 2021 (19:43 IST)
భారత్‌లో సరికొత్త కరోనా వైరస్ వేరియంట్ వణికిస్తోంది. దీన్ని కోవిడ్‌-19 కరోనా వైరస్‌ రకాలలో ఒకటైన డెల్టా వేరియంట్‌‌గా గుర్తించారు. రెండో విడతలో వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపడానికి ఆ వేరియంటే కారణమని ప్రభుత్వ అధ్యయనం తేల్చింది. భారత జీనోమిక్‌ కన్సార్షియా, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తేలింది. 
 
భారత్‌లో వెలుగుచూసిన బి.1.617 విభాగంలోని మూడు వేరియంట్లలో డెల్టా (బి.1.617.2) కూడా ఒకటి. బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన ఆల్ఫా రకానికన్నా ఇదే ఎక్కువగా వ్యాపిస్తోందని ఈ అధ్యయనం తేల్చింది. దేశ వ్యాప్తంగా దాదాపుగా 12వేలకు పైగా కరోనా వేరియంట్‌లు ఉంటే, వాటన్నింటిలోనూ డెల్టా వైరస్సే ప్రమాదకరమని కూడా ఈ అధ్యయనం తేల్చింది. 
 
నిజానికి దేశంలో మిగిలిన వేరియంట్‌లు పెద్దగా ప్రభావాన్ని చూపలేదని, వాటన్నిటి స్థానాన్ని డెల్టా వేరియంట్‌ ఆక్రమించిందని తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో ఈ వేరియంట్‌ ప్రభావం ఉందని, అత్యధిక కేసులు వెలుగులోకి వచ్చిన ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడ, కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది. 
 
దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తర్వాత కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటానికి ఈ రకమే కారణమని జీనోమిక్‌ ప్రతినిధులు వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తర్వాత బ్రిటన్‌లో వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్‌ వ్యాప్తి దాదాపుగా ఆగిందని, డెల్టా విషయంలో మాత్రం ఆ పరిస్థితి లేదని తెలిపింది. దేశ వ్యాప్తంగా 29 వేల నమూనాల జన్యుక్రమ విశ్లేషణ చేయగా 8,900 శ్యాంపిల్స్‌లో బి.1.617 రకపు కరోనాను గుర్తించామని, వాటిలో వెయ్యికిపైగా నమూనాల్లో డెల్టా రకం ఉందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు