కరోనాకు అడ్డుకట్ట ఎక్కడ? అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు

గురువారం, 21 మే 2020 (09:43 IST)
దేశంలో కరోనా వైరస్‌కు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా నానాటికీ ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో మరోసారి 5,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో5,609 మందికి కొత్తగా కరోనా సోకింది.
 
గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 3435కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,12,359కి చేరింది. 63,624 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 
 
ఏపీలో పెరుగుతున్న కేసులు 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బుధవారానికి ఈ కేసుల సంఖ్య 2,560కి చేరుకున్నాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 2,407 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 153 మంది ఉన్నారు. 
 
ఇక బుధవారానికి 9,159 మందికి పరీక్షలు నిర్వహించగా 68 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో నిన్న ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 53కు పెరిగింది. 
 
మొదట్లో తొలి 500 కేసులకు 25 రోజులు పట్టగా, ప్రస్తుతం 9 రోజుల్లోనే 500 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 21న రాష్ట్రంలో కేవలం 5 కేసులు మాత్రమే ఉండగా, ఏప్రిల్ 15 నాటికి ఏకంగా 525కు చేరుకున్నాయి. ఆ తర్వాతి నుంచి వేగంగా పెరుగుతూ బుధవారం నాటికి 2,560 కేసులకు చేరుకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు