ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్న అమలాపురం డివిజన్లో పది మంది పోలీసులకు కరోనా వైరస్ సోకగా, రాజోలు ప్రభుత్వ స్కూలులో ఏడుగురు ఉపాధ్యాయులకు కూడా కరోనా పోసిటీవ్ అని తేలింది.
తాజాగా అల్లవరం మండల తహశీల్దార్ సహా మరో నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కోనసీమలో గత ఐదు రోజుల నుంచి కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. కాగా, మిగతా డివిజన్ల కంటే అమలాపురం డివిజన్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని అమలాపురం ఆర్డీవో వసంతరాయుడు వెల్లడించారు.
ఇటీవల జరిగిన దసరా ఉత్సవాలలో జన సమూహం ఏర్పడటంతో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. స్కూళ్లలో ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఉపాధ్యాయులకు కూడా కరోనా సోకుతోందని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా సోకిన ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసామని, కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో వసంతరాయుడు తెలిపారు.