దేశంలో మంగళవారం కొత్తగా 3,48,421 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం గడచిన 24 గంటల్లో 3,55,338 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 4,205 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,54,197కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,93,82,642 మంది కోలుకున్నారు. 37,04,099 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 17,52,35,991 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 30,75,83,991 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,83,804 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
మరోవైపు, భారత్‌లో వాస్తవ పరిస్థితులను ఆ దేశ పాలకులు దాచిపెడుతున్నారంటూ అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్, అధ్యక్షుడు బైడెన్ ముఖ్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం నేటి పరిస్థితికి తప్పుడు లెక్కలు, వ్యవస్థలను ముందుగా తెరవడమే కారణమన్నారు. తప్పుడు లెక్కలే భారత్ కొంపముంచాయన్నారు. కరోనా ఖతమైపోయిందని భావించి వ్యవస్థలను యథేచ్ఛగా తెరిచేశారని అన్నారు.