దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల ఇప్పటికే దాదాపు లక్షకు చేరువయ్యాయి. అలాగే, ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన మీడియా ప్రకటన మేరకు 2,135కు పెరిగాయి. గత 24 గంటల్లోనే ఏకంగా 495 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురిచేస్తుంది.
ఇదిలావుంటే, దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌కు చెందిన 74 యేళ్ళ వృద్ధుడు ఒమిక్రాన్ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాయన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ వృద్ధుడు జ్వరం, దగ్గు రావడంతో ఉదయ్‌పూర్‌లోని మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆస్పత్రిలో డిసెంబరు 15వ తేదీన చేర్పించారు. డిసెంబరు 21, 25 తేదీల్లో రెండుసార్లు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. డిసెంబరు 31వ తేదీన ఆ వృద్ధుడు మరణించినట్టు పేర్కొంది.