వర్కింగ్ జర్నలిస్టుల కాస్తంత వళ్లుదగ్గర పెట్టుకుని పనిచేయాలని కరోనా వైరస్ హెచ్చరించింది. కరోనా ఏం చేస్తుందిలే అని భావించి ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ తిరిగినా, ఇష్టానుసారంగా ప్రెస్‌మీట్లకు వెళ్లినా తాను సోకకుండా మానను అని హెచ్చరించింది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు వెళ్లిన ఓ విలేకరికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ సమావేశానికి హాజరైన విలేఖరులందరినీ హౌస్ క్వారంటైన్‌కు పంపుతూ ఆదేశాలు జారీచేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మార్చి 20వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన జర్నలిస్టుకు తాజాగా ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు అదే సమావేశానికి హాజరైన మిగతా జర్నలిస్టులను హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని సూచించారు. కాగా, బాధిత జర్నలిస్టుకు అతడి కుమార్తె ద్వారా ఈ వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు.
మార్చి 17న ఆయన కుమార్తె లండన్ నుంచి వచ్చిందని, ఆమెతో ఉండడం వల్లే వైరస్ సోకి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన భార్య, కుమారుడికి పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది.