మహారాష్ట్రలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా మరణాలు 27వేలు దాటాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 423 మంది వ్యాధి బారిన పడి మరణించగా ఇప్పటివరకు మొత్తం 27,027 మంది మృత్యువాత పడ్డారని మంగళవారం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇవాళ 16,429 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 9,23,641కి చేరుకుంది. తాజాగా 14,922మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా మొత్తం 6,59,322మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం 2,36,934 యాక్టీవ్ కేసులున్నాయి.
అలాగే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షలకు చేరువవగా, మరణాల రేటు దిగిరావడం సానుకూల పరిణామమని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ తొలి వారంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించేవారి సంఖ్య 2.15 శాతం ఉండగా, ఇప్పుడది ఏకంగా 1.7 శాతానికి దిగివచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు.