బస్సులు కొన్నే... కానీ జనం కుప్పలు, మాస్కులు లేవు, ఏపీలో మళ్లీ కరోనా విజృంభణ, 1,236 పాజిటివ్ కేసులు
కరోనావైరస్. చచ్చిపోయిందంటూ సెటైర్లు వేస్తున్నవారు కొందరు. మాస్కులు వేసుకున్నవాళ్లకే కరోనావైరస్ పట్టుకుంటుందని మరికొందరు. మాస్కులు లేకుండా హాయిగా రోడ్లపై తిరిగే వారిని కరోనావైరస్ ఏమీ చేయడంలేదని చెప్పేవారు మరికొందరు. ఇలా మాట్లాడుకుంటూ, ఆలోచనలు చేస్తూ సూక్ష్మాతిసూక్ష్మమైన కరోనావైరస్ తో చెలగాటమాడుతున్నారు. ఫలితంగా మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
ఇలా ఎందుకు పెరిగిపోతున్నాయి.. జనంలో కరోనావైరస్ అంటే భయం పోయింది. వస్తే... ఏదో రెండు వారాలు హోం క్వారెంటైన్లో వుండొచ్చని అనుకుంటున్నారు. ఐతే అదే తీవ్రమైతే ప్రాణాలనే కబళిస్తుంది. ఫలితంగా ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుంది. ఆంధ్రలో పరిస్థితి ఎలా వుందంటే... ఇటీవలి బస్సులు నడుస్తున్నాయి. రైలు సౌకర్యం లేకపోయేసరికి జనం అంతా ఎగబడుతున్నారు.
పదేళ్లలోపు చిన్నపిల్లలు, వృద్ధులు ప్రయాణం చేయరాదు అని బస్సుల్లో బోర్డులు అయితే కనబడుతున్నాయి కానీ జనం మాత్రం మాట వినడంలేదు. పసిబిడ్డలను సైతం చంకనేసుకుని బస్సుల్లో తోసుకుంటూ ఎక్కేస్తున్నారు. ఇక మాస్కులు వేసుకోవడం ఎప్పుడో మర్చిపోయారు. ఫలితంగా ఏపిలో మళ్లీ కరోనావైరస్ పడగ విప్పుతోంది. గత 24 గంటల్లో 1236 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 750కి దిగువకు వచ్చిన కేసులు మళ్లీ క్రమంగా ఊపందుకుంటున్నాయి.