దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు... విదేశాలకు వెళ్లని వారికి కూడా...

శనివారం, 21 మార్చి 2020 (14:05 IST)
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, విదేశాలకు వెళ్లనివారికి కూడా ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటివరకు విదేశాలకు వెళ్లి వచ్చినవారికి, వారుతో కలిసివున్న వారికే ఈ వైరస్ సోకుతుందన్న ప్రచారం ఉండేది. కానీ, పూణెలో ఓ మహిళకు ఈ వైరస్ సోకింది. ఆమె విదేశాలకు వెళ్లలేదు. అయినప్పటికీ ఈ వైరస్ సోకిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని, వ్యక్తిగత శ్రద్ధ పాటించాలని వైద్యులు సూచన చేస్తున్నారు. 
 
మరోవైపు, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 271కి చేరింది. ఈ విషయాన్ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా కారణంగా ఇప్పటివరకు దేశంలో మొత్తం నలుగురు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ నలుగురులో ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు ఉన్నారని తెలిపింది. 
 
ఇకపోతే, దేశంలో కరోనా పాజిటివ్ అని తేలిన వారిలో 39 మంది విదేశీయులని తెలిపింది. కరోనా పాజిటివ్‌ అని తేలిన వారితో గతంలో కలిసున్న వారికి పరీక్షలు నిర్వహించాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సూచించింది. కాగా, కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా రేపు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ సూచించిన విషయం తెలిసిందే.
 
ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల్లో ఒక్కటి కూడా ఇక్కడ నమోదైన కేసు కాదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారితో సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే, పుణెకు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ గొంతు నొప్పితో బాధపడుతోంది. 
 
దీంతో స్వైన్‌ఫ్లూ అని భావించిన ఆ మహిళ పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. భారతి ఆస్పత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
దీనిపై పూణె జిల్లా కలెక్టర్ నావల్‌ కిశోర్‌ రామ్‌ మాట్లాడుతూ, ఈ కేసును తాము విచారిస్తున్నామని తెలిపారు. ఆమె విదేశాలకు వెళ్లలేదు. విదేశాల నుంచి ఎవరూ కూడా ఆమె నివాసానికి రాలేదు. అయినప్పటికీ ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే నవీ ముంబైలో మార్చి 3న జరిగిన ఓ వివాహానికి ఆమె హాజరయ్యారు. ఇక్కడే విదేశీ ప్రయాణం చేసి ఉన్న వ్యక్తి ఉండొచ్చని, అతని కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు