కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్న వేళ.. కరోనాతో పెను ప్రమాదం పొంచి వుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని చెప్పిన శాస్త్రవేత్తలు.. మరో షాకిచ్చే విషయం తెలిపారు. కోవిడ్-19 రోగుల్లో పలు రకాల మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించామని లండన్ పరిశోధకులు తాజాగా వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. అంతేకాదు కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని, అంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లివర్‌పూల్ విశ్వవిద్యాలయం సహా, ఇతర శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కరోనా రోగుల్లో గుండె జబ్బులు, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత, మానసిక సమస్యలను కరోనాకు భారీగా ప్రభావితమైన దేశాలు నివేదించాయి.
ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనాల ప్రకారం స్ట్రోక్, మెదడు వాపు, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. కరోనా సోకిన వారిలో దాదాపు వెయ్యి మంది రోగులు ఇలాంటి సమస్యలకు గురయ్యారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ సోకిన బాధితుల్లో మెదడులో ఇన్ఫెక్షన్ లేదా వాపు ముప్పు వున్నట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.