ఏపీలో తీవ్రంగా కొవిడ్‌: అనిల్‌ సింఘాల్‌

శనివారం, 24 ఏప్రియల్ 2021 (11:50 IST)
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ తీవ్రంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులు తగ్గినప్పుడు కరోనా కేర్‌ సెంటర్లను మూసివేశామని.. ఇప్పుడు మళ్లీ వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా 21వేల మంది వైద్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని.. ఆస్పత్రులు, ఔషధాలు, పడకలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36 వేలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో 8 వేలు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో నాలుగు లక్షల ఇంజెక్షన్లను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 320 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని.. చెన్నై, బళ్లారి నుంచి మరో 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌, రెమ్‌డెసివివర్‌ అవసరం అంతగా లేదన్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో 19వేల పడకలు సిద్ధం చేస్తే 11 వేల పడకలు నిండినట్లు చెప్పారు. మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా వేస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు