సోనూ భాయ్! మీరు చాలా గ్రేట్... మరో రెండు రైళ్లలో వలస కార్మికులను తరలించిన రియల్ హీరో

మంగళవారం, 2 జూన్ 2020 (11:42 IST)
రీల్ విలన్.. రియల్ హీరో, బాలీవుడ్‌ నటుడు సోనూసూద్ మరోమారు తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. తన సొంత ఖర్చుతో రెండు రైళ్ల ద్వారా వలస కార్మికులను వారి సొంతూళ్లకు పంపించారు.

ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల వలస కార్మికులు మరో వెయ్యి మంది కోసం ప్రత్యేకంగా రెండు రైళ్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని థానే రైల్వే స్టేషన్‌ నుంచి ఈ రెండు రైళ్లను ఏర్పాటు చేశారు.

సోమవారం వాటి ద్వారా కార్మికులను వాళ్ల స్వస్థలాలకు తరలించారు. ఈ కార్మికులకు కావాల్సిన కనీస అవసరాలైన భోజనం, సానిటైజర్లను సోను, మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాయి.

ఈ సందర్భంగా ఈ ఏర్పాట్లు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వానికి సోను కృతజ్ఞతలు తెలిపారు. వలస కార్మికుల కోసం తన సామార్థ్యం మేరకు సాయం అందిస్తానని చెప్పారు. ప్రతి కార్మికుడూ తమ ఇంటికి చేరుకునే వరకూ ఈ సేవను కొనసాగిస్తానని తెలిపారు.

ఇప్పటికే లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ముంబయి నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక బస్సులో తరలించారు.

వెయ్యి మందికి పైనే ఇలా సోను ఏర్పాటు చేసిన బస్సుల్లో ఉత్తరప్రదేశ్‌లో తమ సొంతూళ్లకు చేరుకున్నారు. కేరళలో టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలో పని చేసే 177 మంది అమ్మాయిలను ప్రత్యేక విమానంలో ఒడిశా పంపించిన విషయమూ తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు