తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 1,02,70,249 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గురువారం కరోనాతో ఐదుగురు మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,706కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 312 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,159 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 2,622 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 254 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు కమలాపూర్ మండలంలోని భీంపల్లికి చెందిన ఓ యువకుడు (20) సుమారు 10 రోజులు జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతూ గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. దీంతో ఆ ఆర్‌ఎంపీ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి యువకుడిని తరలించగా అక్కడ కరోనా పాజిటివ్ అని తేలడంతో రెండు రోజుల పాటు చికిత్స చేశారు.
ఆ తర్వాత యువకుడు మళ్లీ గ్రామానికి రాగా, కరోనా విషయాన్ని దాచిన ఆర్‌ఎంపీ మరో మూడు రోజులు వైద్యం చేశాడు. ఇంతలోనే యువకుడి పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళితే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఆ తర్వాత యువకుడిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ గత నెల 27న ఆ యువకుడు మృతి చెందాడు.
కరోనా పాజిటివ్ అని తేలాక కూడా ఎవరికీ చెప్పకుండా వైద్యం చేసిన ఆర్‌ఎంపీ వైద్యుడు, వరంగల్‌లో వైద్యం అందించిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు గత నెల 31న జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు.