తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బడ్జెట్‌కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు సీఎం కేసీఆర్. ఆరోగ్య మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నామని... ఇప్పుడు వేటికీ కొరతలేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని గాంధీ, టిమ్స్‌లోనే దాదాపు 3 వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. 1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయని.. లక్షల సంఖ్యలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.