హాలీవుడ్ హీరో దంపతులకు కరోనా వైరస్

గురువారం, 12 మార్చి 2020 (10:26 IST)
ప్రముఖ హాలీవుడ్ హీరో దంపతులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వీరిద్దరినీ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ హాలీవుడ్ పేరు టామ్ హంక్స్. ఈయన  భార్య రీటా విల్సన్. వీరిద్దరికీ వైరస్ సోకినట్టు వైద్యపరీక్షల్లో తేలింది. 
 
ఆస్ట్రేలియా దేశంలో ఓ సినిమా షూటింగులో ఉన్న సెలబ్రిటీ దంపతులు గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ వచ్చారు. దీంతో బుధవారం వారు రక్తపరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కరోనా వైరస్ సోకిందని తేలడంతో టామ్ హంక్స్, రీటా విల్సన్ దంపతులను ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
'మేం జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నాం. మాకు కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది' అని టామ్ హంక్స్ దంపతులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. 
 
ఇదిలావుంటే, కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో ముందు జాగ్రత్తగా తన షోను నవంబరుకు వాయిదా వేస్తున్నట్లు జలుబుతో బాధపడుతున్న ప్రముఖ గాయకురాలు సీలైన్ డియాన్ ప్రకటించారు. తనకు జరిపిన పరీక్షలో కరోనా వైరస్ నెగిటివ్ అని వచ్చిందని సీలైన్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు