ఆమెకి చెబితే ఏమవుతారోనని అంత్యక్రియలు చేయించామన్న మంత్రి, సుప్రీంకు వెళ్తానంటున్న మాధవి

గురువారం, 21 మే 2020 (19:48 IST)
గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారు. వాళ్ళపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కరోనాతో చనిపోతే అంత్యక్రియలు చెయ్యటానికి భయపడుతున్నారు.
 
ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పని చేస్తోంది. కరోనా కేసుల విషయంలో కానీ, కరోనా మరణాల విషయంలో కానీ ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా ప్రకటన చేస్తోందన్నారు మంత్రి. కరోన పాజిటివ్ వచ్చిన మొదట్లో ఎవరన్నా చనిపోతే వారి కుటుంబ సభ్యులు సైతం చూడటానికి దగ్గరికి రాలేదు. దహనసంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు.
 
అమెరికా, ఇటలీ లాంటి దేశాలలో వందలమంది చనిపోతే కుటుంబ సభ్యులు లేకపోతే ప్రభుత్వాలే అంత్యక్రియలు చేశాయి అన్నారు మంత్రి ఈటల. ఏప్రిల్ 29వ తేదీన వనస్థలిపురం నుండి ఈశ్వరయ్య అనే పేషంట్ కరోనా పాజిటివ్‌తో గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇరవైనాలుగు గంటల లోపే 30వ తేదీన చనిపోయారు. దీనితో ఆయన కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశాం. 
 
ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందితో గాంధీకి వచ్చారు. 1వ తేదీన చనిపోయారు. అప్పటికే ఆయన భార్యతో సహా కుటుంబసభ్యులు అందరూ క్వారంటైన్లో ఉన్నారు.
 
భార్యకి చెప్తే షాక్‌కి గురవుతుంది అనీ, గంభీరమైన సందర్భంలో చెప్పకుండా ఉండటమే మేలని చుట్టాలు చెప్పిన నేపధ్యంలో మృతదేహాన్ని పోలీసులకి అప్పగించి జిహెచ్ఎంసి ద్వారా దహన సంస్కారాలు నిర్వహించారని మంత్రి వివరించారు.
 
బంధువులకు చెప్పకుండా కరోనా వచ్చిన మధుసూదన్‌ను ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది అని వస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. కోలుకుని బయటకి వచ్చాక గాంధీ ఆస్పత్రిపై ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. రాపిడ్ కిట్స్ మీద నమ్మకం లేదని మొదటి నుండి చెప్తున్నాము. ఇప్పుడు ICMR కూడా అదే చెప్పింది అని మంత్రి అన్నారు. 
 
అలాగే కోవిడ్ పరీక్షలు, చికిత్స ప్రభుత్వరంగంలోనే అందిచాలని ఆ సామర్ధ్యం మనకి ఉంది అని సిఎం చెప్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  పరీక్షలు, చికిత్స అందిస్తున్నాము అని మంత్రి అన్నారు.
 
ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలితే వారి కుటుంబ సభ్యులు, పాజిటివ్ వ్యక్తి కలిసిన వారందరినీ ట్రేస్ చేసి తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నాం. అవసరం అయితే క్వారంటైన్ చేస్తున్నాము. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు చేయగలరా అని మంత్రి అన్నారు. 
 
వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు అన్నీ కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యం అవుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షించుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు.
 
నా భర్త చనిపోయాడని ఎవరో ఒకరు చెబితే సరిపోదు: మాధవి
నా భర్తను నేను స్వయంగా చూసి గుర్తించాలి. జీహెచ్‌ఎంసీ వాళ్లు అనాధ శవంలా అంత్యక్రియలు చేయడం సరైనదేనా? నా బంధువులకు నేనేం సమాధానం చెప్పాలి. నా భర్త చనిపోయినట్లు సాక్ష్యం కావాలి. నా భర్త కోసం సుప్రీంకోర్టులో పోరాడేందుకైనా సిద్ధం. నా భర్తపై ఏమైనా ప్రయోగాలు చేశారేమోననే అనుమానం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు