కరోనా కొత్త మందు.. 'కాక్‌టెయిల్' తీసుకున్న 24 గంటల్లోనే స్వస్థత!

ఆదివారం, 13 జూన్ 2021 (11:40 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు ఇపుడు మరో కొత్త మందు వచ్చింది. ఈ మందు తీసుకున్న 40 మందికి కోలుకోవడం గమనార్హం. ఈ మందు హైదరాబాద్ నగరంలో అందుబాటులో వచ్చింది. ఆ మందు పేరు కాక్‌టెయిల్ ఔషధం. 
 
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస బారినపడినపుడు ఆయనకు ఉపయోగించిన మందే ఇది. దీనిపేరు మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధం. రోచే కంపెనీకి చెందిన ఈ ఔషధాన్ని 40 మంది కరోనా రోగులకు అందించగా సానుకూల ఫలితాలు వచ్చాయని హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. 
 
‘కాక్‌టెయిల్‌’ తీసుకున్న వారంతా తేలికపాటి కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ కలిగినవారేనని తెలిపారు. ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయిన మూడు నుంచి వారంరోజుల్లోనే వీరందరికీ ఔషధాన్ని అందించినట్లు చెప్పారు. కాక్‌టెయిల్‌ను తీసుకున్న 24 గంటల్లోనే నలభై మంది లబ్ధిదారుల్లోనూ జ్వరం, నీరసం వంటి కొవిడ్‌ లక్షణాలన్నీ మటుమాయం అయ్యాయని పేర్కొన్నారు. 
 
డెల్టా వేరియంట్‌పై ఈ ఔషధం పనితీరు, ప్రభావశీలతను తెలుసుకునేందుకు తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో పెద్దఎత్తున అధ్యయనం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. దీన్ని అందించిన వారం తర్వాత లబ్ధిదారులకు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా, వారిలో కరోనా వైరస్‌ పూర్తిగా నిర్వీర్యమైందని తేలిందన్నారు. కాగా, ఈ కాక్‌టెయిల్‌ ఔషధం ధర భారత్‌లో రూ.70వేలుగా ఉంది. ఈ మందు సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేదు. కేవలం ధనికులకు మాత్రమే ఈ మందు వాడేలా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు