దేశంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు

సోమవారం, 27 జూన్ 2022 (11:23 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా ఈ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ, సోమవారం నమోదైన కేసుల్లో ఏకంగా 45 శాతం పెరుగుదల కనిపించింది. గత 24 గంటల్లో ఏకంగా 17 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 94 వేలకు ఎగబాకింది. 
 
దేశ వ్యాప్తంగా మొత్తం 3.03 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో 17,073 మందికి వైరస్ సోకిందని సోమవారం కేంద్రం వెల్లడించింది. దాంతో పాజిటివిటీ రేటు 5 శాతానికి చేరి, ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళలో కలిపి మొత్తం దాదాపు 10 వేల కేసులొచ్చాయి. తమిళనాడులో వెయ్యి దాటగా ఢిల్లీలో రెండువేలకు చేరువయ్యాయి. 
 
తాజాగా వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 94,420కి చేరాయి. క్రియాశీల కేసుల రేటు 0.22 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.57 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో 15,208 మంది కోలుకున్నారు. 21 మంది మరణించారు. ఇప్పటివరకూ 4.34 కోట్ల మందికిపైగా కరోనా బారినపడగా 4.27 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. 5.25 లక్షల మందికి పైగా మరణించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు