రెండు మ్యాచ్‌ల టీ20 కోసం ఐర్లాండ్ వెళ్లిన భారత్ జట్టు ఆదివారం తొలి టీ20 మ్యాచ్‌ను ఆడింది. ఈ మ్యాచ్ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో జరుగగా, ఇందులో భారత జట్టు అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకిగా మారడంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ జట్టు 12 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ఇందులో హెర్రీ టెక్టాక్ 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఆ తర్వాత కీపర్ టకర్ 16 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 18 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, అవేశ్ ఖాన్, చావల్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
ఆ తర్వాత 109 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 9.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. దీపక్ హుడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు (నాటౌట్) చేయగా, ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశారు. చివరి మ్యాచ్ మంగళవారం రాత్రి జరుగనుంది.