29వ ఏట అడుగెట్టిన కొత్త పెళ్లి కొడుకు "మహేంద్రుడు"..!
FILE
'టీమ్ ఇండియా' కూల్ కెప్టెన్, కొత్త పెళ్లికొడుకు మహేంద్ర సింగ్ ధోనీ 29వ ఏట అడుగుపెట్టాడు. భారత క్రికెట్ జట్టుకు సమర్థవంతంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోనీ ఈ నెల నాలుగో తేదీన (ఆదివారం) ఓ ఇంటివాడయ్యాడు. ఐసీసీ బ్యాట్స్‌మెన్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ధోనీ, టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమ్ ఇండియాను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు.
తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి రావత్ సింగ్‌తో శనివారం నిశ్చితార్థం, ఆదివారం వివాహం చేసుకుని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీకి నేడే పుట్టినరోజు. ఇంకా ఇదే రోజున దేశ వాణిజ్య నగరం ముంబైలో మహేంద్ర సింగ్ ధోనీ దంపతుల పెళ్లి రిసెప్షన్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
డెహ్రాడూన్‌లో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య ధోనీ - సాక్షి సింగ్ రావత్‌ల పెళ్లి నిరాండబరంగా జరిగిపోయింది. కానీ రిసెప్షన్ వేడుకను మాత్రం మహేంద్రసింగ్ ధోనీ కుటుంబీకులు అంగరంగవైభవంగా నిర్వహించాలని యోచిస్తున్నారు. పెళ్లి తరహాలో రిసెప్షన్ కూడా సీక్రెట్‌గా జరిగిపోతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
FILE
కాగా, 1981, జూలై 7న జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించిన మహేంద్రసింగ్ ధోని కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్‌గా భారత జట్టుకు సేవలు అందిస్తున్నాడు. 2005లో పాకిస్థాన్‌తో జరిగిన ఐదో వన్డేలో 148 పరుగులు సాధించి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.
అదే ఏడాది శ్రీలంకపై 183 పరుగులు చేసి నాటౌట్‌గా నిల్చి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. ఇది భారత్ తరపున వన్డేలో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఫలితంగా ఐసీసీ బ్యాట్స్‌మెన్ వన్డే ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
ధోనీ నాయకత్వంలో భారత టెస్టు క్రికెట్ జట్టు 2009వ సంవత్సరం, శ్రీలంక పర్యటనలో 726-9 భారీ స్కోరును నమోదు చేసుకుని రికార్డు సృష్టించింది. ఫలితంగా 2-0తేడాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ జట్టు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానాన్ని సొంతం చేసుకుని చరిత్ర పుటలకెక్కించిన ధోనీ బుధవారం తన 29వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాడు.