603 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా.. అదరగొట్టిన పుజారా, సాహా, జడేజా

సోమవారం, 20 మార్చి 2017 (12:15 IST)
రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా చెలరేగిపోయింది. తొలి రెండు రోజుల పాటు ధీటుగా ఆడలేని టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌ను 603/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. 11 గంటల పాటు క్రీజులో నిలిచి పుజారా (525 బంతుల్లో 21 ఫోర్లతో 202) మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తద్వారా తన ఖాతాలో మూడో డబుల్ సెంచరీని సాధించాడు. 
 
పుజారాకి తోడు సాహా (233 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 117) అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఏడో వికెట్‌కు వీరిద్దరి 199 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివర్లో జడేజా (55 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 నాటౌట్) రాణించడంతో ఆతిథ్య జట్టుకు 152 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ 210 ఓవర్లు బౌలింగ్ చేసినా భారత్‌ను ఆలౌట్ చేయలేకపోయింది. ఫలితంగా 603 పరుగుల వద్ద భారత్ డిక్లేర్ చేసింది.
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 7.2 ఓవర్లలో 2 వికెట్లకు 23 పరుగులు చేసింది. వార్నర్ (14), లియాన్ (2) విఫలమయ్యారు. రెన్‌షా 7 పరుగులతో క్రీజులో నిలిచారు. అయితే సోమవారం ఐదో రోజు ఆటను 23 పరుగుల వద్ద ప్రారంభించిన ఆస్ట్రేలియా డ్రింక్స్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు సాధించగా, 24.4 ఓవర్లలో 50 పరుగులు సాధించింది. ఇక లంచ్  విరామానికి నాలుగు వికెట్ల పతనానికి 83 పరుగులు సాధించింది.

వెబ్దునియా పై చదవండి