Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

దేవి

శనివారం, 26 ఏప్రియల్ 2025 (23:27 IST)
Retro
'రెట్రో' చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: విజయ్ దేవరకొండ 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కొత్త చిత్రం ప్రకటన
 
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెట్రో'. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండటం విశేషం. 
 
శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ లో 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
ముఖ్య అతిథి, ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సినిమా గురించి మాట్లాడేముందు.. ముందుగా పహల్గాం బాధితులకు నివాళులు. సూర్య అన్న మూవీ ప్రమోషన్ కోసం నేను ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేను గజిని సినిమా చూసి సూర్య అన్నతో ప్రేమలో పడిపోయాను. ఎవర్రా ఈయన, ఇంత బాగా నటిస్తున్నాడు అనుకొని.. సూర్య అన్న నటించిన మిగతా సినిమాలన్నీ చూశాను. సూర్య సన్నాఫ్ కృష్ణన్ నా మనసుకి బాగా నచ్చిన సినిమా. చంచల సాంగ్ చూసి భావోద్వేగానికి గురయ్యాను. ఆ పాట నాకెప్పటికీ ఓ మంచి జ్ఞాపకం. 
 
సూర్య అన్నను తెరమీద చూసి.. అసలు ఈ మనిషి బాడీ ఏంటి, యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి? ఒక్కసారైనా జీవితంలో కలవాలి అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో వేదిక పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. నటుడిగా సూర్య అన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన సినిమాల ఎంపిక మిగతా నటుల్లో స్ఫూర్తి నింపేలా ఉంటుంది. విభిన్న జానర్స్ లో సినిమాలు చేస్తుంటారు. 
 
రెట్రోతో సూర్య అన్న మరో ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య అన్న ఎందరో విద్యార్థులకు అండగా నిలబడుతున్నారు. ఆయన స్ఫూర్తితో నేను కూడా విద్యార్థులకు సాయం చేయాలి అనుకుంటున్నాను. మే 1న విడుదలవుతున్న రెట్రో సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను." అన్నారు.
 
చిత్ర కథానాయకుడు సూర్య మాట్లాడుతూ, "ముందుగా పహల్గాం బాధితులకు నివాళులు. రెట్రో వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు నాపై కురిపిస్తున్న ప్రేమ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ గారి సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. రెట్రో ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. 
 
సంతోష్ నారాయణన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే తెలుగులో శ్యామ్ గారు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ప్రకాష్ రాజ్ గారు, జోజు జార్జ్ గారు, జయరామ్ గారు, నాజర్ గారు లాంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. పూజ హెగ్డే నాకంటే ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేస్తోంది. మీరు ట్రైలర్ లో చూసినట్టుగానే.. లవ్, కామెడీ, యాక్షన్, ఇంటెన్సిటీ అన్నీ సినిమాలో ఉంటాయి. 
 
మే 1న విడుదలవుతున్న రెట్రో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాగవంశీ గారిది లక్కీ హ్యాండ్ అంటుంటారు. ఆయనతో చేతులు కలపడం సంతోషంగా ఉంది. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీ గారి నిర్మాణంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. మే 1న విడుదలవుతున్న నాని 'హిట్-3' కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 
 
విజయ్ నా సోదరుడు లాంటివాడు. విజయ్ జర్నీ చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. 'కింగ్ డమ్' సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విజయ్ అగరం ఫౌండేషన్ గురించి మాట్లాడాడు. అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా అగరం ఫౌండేషన్ కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు. నాకు ఇన్నేళ్ళుగా సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్న నా అభిమాన సోదరులకు, సోదరీమణులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు." అన్నారు.
 
అతిథి, ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, "ఇక్కడ చాలామంది సూర్య గారి అభిమానులున్నారు. వారిలో నేను కూడా ఉన్నాను. నా కాలేజ్ లైఫ్ లో సూర్య గారి సినిమా ఒక పాఠం లాంటిది. గజినీ సినిమా చూసి.. ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా? ఒక నటుడు ఇంత కష్టపడతారా? అనుకున్నాను. నేను సినీ పరిశ్రమలోకి రావాలి అనుకుంటున్నప్పుడు చూసిన సినిమా అది. నాకెప్పుడూ ప్రత్యేకమైనదే. 
 
ఇక 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' అయితే.. అది సినిమా కాదు, అదొక టెక్స్ట్ బుక్. ప్రేమలో ఎలా పడాలో నేర్పింది, విఫలమైతే దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పింది, క్రమశిక్షణ కూడా నేర్పింది. సూర్య గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన ప్రతి సినిమా నుంచి ఏదోకటి నేర్చుకున్నాము. 
 
ఇప్పుడు రెట్రోతో వస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ గారి మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఇలాంటి ట్రైలర్ కట్ నేనెప్పుడూ చూడలేదు. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను. సూర్య గారు, విజయ్ గారు బ్రదర్స్ లా ఉన్నారు. ఇద్దరూ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మే 1న విడుదలవుతున్న రెట్రో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ, టీం అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.
 
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, "తెలుగులో రెట్రో సినిమాని విడుదల చేసే అవకాశమిచ్చిన సూర్య గారికి ధన్యవాదాలు. మిమ్మల్ని ఈ తరహా సినిమాలో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో మీరు ఘన విజయాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన విజయ్ దేవరకొండ గారికి, సోదరుడు వెంకీ అట్లూరికి థాంక్స్." అన్నారు.
 
చిత్ర సహ నిర్మాత కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ, "2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ తో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం సంతోషంగా ఉంది. మా టీం అందరికీ ఈ సినిమా ప్రత్యేకమైనది. అందరం ఎంతో కష్టపడి పనిచేశాము. సూర్య గారు చాలా మంచి మనిషి. ఆయన నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయ్ దేవరకొండ గారికి, వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు." అన్నారు.
 
గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, "సూర్య గారికి తెలుగులో ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో ఉన్న ఆరు పాటలూ నేను రాయడం జరిగింది. కార్తీక్ సుబ్బరాజ్ గారితో నాకిది రెండో సినిమా. తమిళ నుంచి అనువాదం లాగా కాకుండా, పక్కా తెలుగు లాగా రాశారని ఎందరో సూర్య గారి అభిమానులు నాకు మెసేజ్ లు చేయడం సంతోషం కలిగించింది." అన్నారు.
 
నటుడు కరుణాకరన్ మాట్లాడుతూ, "నేను ఎంతగానో అభిమానించే సూర్య గారి సినిమాలో నటించడం అనేది నా కల నిజమైనట్టుగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గారికి కృతఙ్ఞతలు." అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు