కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వున్న క్రికెట్ దిగ్గజాలపై కన్నేసింది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్లైన అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లకు గాలం వేస్తోంది. వీరిద్దరి మద్దతు బీజేపీకి వుంటే.. యువ ఓటర్ల ఓట్లు కొల్లగొట్టవచ్చునని బీజేపీ పక్కా ప్లాన్ చేసింది. ఇప్పటికే పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు వీరిద్దరితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించగా.. ఆ ఇద్దరు క్రికెటర్లు మెల్లగా జారుకున్నారని తెలిసింది.
మరోవైపు ప్రస్తుతం ద్రావిడ్ ఎన్నికల రాయబారిగా వ్యవహరిస్తున్నారు. కుంబ్లే గతంలో వన్యప్రాణుల మండలి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే బీజేపీ ఆహ్వానాన్ని ఇద్దరు క్రికెటర్లు తిరస్కరించినట్టు సమాచారం. ప్రస్తుతానికి రాజకీయాలొద్దని వీరిద్దరూ భావిస్తున్నారని.. అందుకే బీజేపీ జోలికి వెళ్లకుండా తప్పుకున్నారని తెలిసింది.
ఇదిలా ఉంటే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సింగపూర్‌లో వున్నారు. సింగపూర్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబును సచిన్ కలిశాడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశాడు. నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని సచిన్ ఇప్పటికే దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ గ్రామ అభివృద్ధిపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగిందని చర్చ సాగుతోంది.