ఆసియా ఖండానికి చెందిన దేశాల మధ్య ఆసియా క్రికెట్ కప్ టోర్నీ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ టోర్నీలోభాగంగా, లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ దేశాలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు సెప్టెంబరు 14, 21వ తేదీల్లో నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఆసియా కప్ హోస్ట్ హక్కులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు చెందినప్పటికీ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా నిర్వహిస్తారు. ఇపుడు ఇదే బీసీసీఐపై అభిమానులు ఆగ్రహానికి గురిచేసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో టీమిండియా క్రికెట్ ఆడకూడదని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడ్డారు. తాజాగా వరల్డ్ చాంపియన్స్ షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాక్ చాంపియన్స్‌తో భారత్ చాంపియన్స్ జట్టు ఆడలేదు. దీంతో ఈ మ్యాచ్ రద్దు అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్‌లో మాత్రం భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎలా నిర్వహిస్తారంటూ బీసీసీఐపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. పైగా, ఆసియా కప్ టోర్నీనే ఏకంగా బాయ్‌కాట్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతున్నారని గుర్తు చేస్తూ, అలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో భారత్ ఎలా క్రికెట్ ఆడుతుందని పలు విపక్ష రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రక్తంతో సంపాదించే ధనంగా వారు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో క్రీడల ద్వారా దౌత్య సంబంధాలు నెరపడం ఏమాత్రం సరైంది కాదని వారు పేర్కొంటున్నారు.