రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపిఎల్ 2025 టైటిల్ విజయోత్సవాల సందర్భంగా జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల బాలిక దివ్యాంశి మృతదేహం నుంచి రూ.లక్ష విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్టు ఆమె తల్లి తాజాగా ఆరోప. ఈ నెల 24వ తేదీన ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దివ్యాంశి తల్లి అశ్విని శివకుమార్ (35) కమర్షియల్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు.
అశ్విని శివకుమార్ ఫిర్యాదు ప్రకారం జూన్ 4 సాయంత్రం దివ్యాంశి మృతదేహాన్ని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆస్పత్రి మార్చురీకి తరలించినప్పుడు ఆమె శరీరంపై 6 గ్రాముల బంగారు చెవిపోగులు, 5-6 గ్రాముల బంగారు గొలుసు ఉన్నాయి. అయితే, శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించినప్పుడు ఈ ఆభరణాలు పూర్తిగా మాయమయ్యాయి. "మొదట్లో దుఃఖంలో ఉండటంతో ఆభరణాలు లేని విషయాన్ని మేము గమనించలేదు. అవి నా కూతురు చివరి క్షణాల్లో ధరించిన జ్ఞాపకాలు, వాటికి ఎంతో భావోద్వేగ విలువ ఉంది" అని అశ్విని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఈ విషాద ఘటనలో మరణించిన 11 మంది బాధితుల్లో దివ్యాంశి అతి చిన్న వయస్కురాలు. యలహంకలోని కన్నూరు నివాసి అయిన దివ్యాంశి.. విరాట్ కోహ్లీకి వీరాభిమాని. క్రికెట్‌పై ఆమెకు అమితమైన ఆసక్తి ఉండేది. తన తల్లి, అత్త, చెల్లెలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరైంది.
కాగా, అశ్విని శివకుమార్ ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 303(2) కింద శివాజీనగర్కు చెందిన 25 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. శవపరీక్షకు ముందు తీసిన ఫోటోల్లో ఆభరణాలు స్పష్టంగా కనిపించినప్పటికీ, అనంతరం అవి లేవని అశ్విని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చోరీ మార్చురీలో జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.