ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు గురువారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత 247 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో నిలిచాయి.
మరోవైపు, వన్డే క్రికెట్‌లో ఇంగ్లాండ్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గా టోప్లే (6/24) నిలిచాడు. లార్డ్స్ మైదానంలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా టోప్లేదే కావడం విశేషం. ఇంతకుముందు షాహీన్ అఫ్రిది (6/35) పేరిట రికార్డు ఉండేది.
మూడేళ్ల కిందట ఇంగ్లాండ్ తొలిసారి వరల్డ్ కప్‌ను నెగ్గిన రోజు (జులై 14) జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం విశేషం. ఇప్పటివరకు లార్డ్స్‌లో తొమ్మిది వన్డేలు ఆడిన భారత్.. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి, మరో నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఒక వన్డేలో ఫలితం తేలలేదు. లార్డ్స్ మైదానంలో భారత్ తన అత్యల్ప స్కోరు (132/3).. మరోసారి చెత్త రికార్డను నమోదు చేసే ప్రమాదం నుంచి తప్పించుకొంది.