నిబంధనలు ఉల్లంఘన : చిన్నస్వామి క్రికెట్ స్టేడియానికి పవర్ కట్

ఠాగూర్

మంగళవారం, 1 జులై 2025 (09:16 IST)
దేశంలోని ప్రముఖ క్రికెట్ స్టేడియాల్లో బెంగుళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియం ఒకటి. ఈ స్టేడియం నిర్వహణలో నిబంధనలు సక్రమంగా పాటించడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిబంధనల ఉల్లంఘనపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. 
 
అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో కర్నాటక క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా విఫలమైందని అధికారులు గుర్తించారు. స్టేడియంలో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ విభాగం కేఎస్‌సీఏకు పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ మేరకు ఫైర్ సర్వీసెస్ డీజీపీ జూన్ 4వ తేదీన ఒక లేఖ రాయగా, అది జూన్ 10వ తేదీన విద్యుత్ సరఫరా కంపెనీ కార్యాలయానికి చేరింది. 
 
పలుమార్లు హెచ్చరించినా కేఎస్‌‍సీఏ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫైర్ సర్వీసెస్ డీజీపీ ఆదేశాల మేరకు బెస్కామ్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సమస్యను పరిష్కరించేందుకు వారం రోజుల సమయం కావాలని కర్నాటక క్రికెట్ సంఘం కోరినప్పటికీ ఆ గడువులోగా కూడా భద్రతా ప్రమాణాలను పాటించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో కరెంట్ సరఫరాను నిలిపివేసింది. 
 
ఇటీవల ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ పోటీల్లో టైటిల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు నిలిచింది. ఆ జట్టుకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు