పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్

శనివారం, 13 జూన్ 2020 (16:02 IST)
పాకిస్థాన్ చిచ్చరపిడుగు, మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కరోనా వైరస్ బారినపడ్డారు. గత గురువారం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. పైగా, ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో డాషింగ్ ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈయనకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. పైగా, కరోనా సోకిన తొలి అంతర్జాతీయ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కావడం గమనార్హం. 
 
ఈ విషయాన్ని ఆఫ్రిదే స్వయంగా వెల్లడించారు. 'గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఒళ్లంతా ఒకటే నొప్పులు. వైద్య పరీక్షలు చేస్తే దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ అని వచ్చింది. త్వరగా కోలుకునేందుకు అల్లా దయ, మీ ఆశీస్సులు కావాలని కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు