భారత క్రికెట్ జట్టుకు కోచ్‌ అంటే 140 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహించడం : గౌతం గంభీర్

వరుణ్

సోమవారం, 3 జూన్ 2024 (11:33 IST)
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌ పదవి తనకు ఇష్టమేనని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించారు. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు నిర్వహించడం అంటే 140 కోట్ల భారతీయుల తరపున ప్రాతినిథ్యం వహించడమేనని అన్నారు. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తును ఆహ్వానించింది. దీంతో కొత్త కోచ్‌గా ఎవరిని బీసీసీఐ ఎంపిక చేస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. దీనిపై గౌతం గంభీర్ స్పందించారు. భారత జట్టుకు మార్గదర్శకుడిగా నిలవడం తనకు ఇష్టమేనని చెప్పారు. 
 
టీమిండియా కోచ్ బాధ్యతలు దక్కడం తన కేరీర్‌‍లోనే అత్యుత్త గౌరవం కాగలదన్నారు. టీమిండియా తదుపరి హెడ్ కోచ్ గౌతం గంభీర్ అని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టీమిండియాకు కోచ్‌‍గా ఉండటం నాకెంతో ఇష్టం. దీనికి మించిన గౌరవం మరొకటి ఉండదు. కోచ్ బాధ్యతలు అంటే 140 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహించడం. ఇంతకంటే పెద్ద గౌరవం మరొకటి ఉంటుదా? అని గంభీర్ వ్యాఖ్యానించారు. 
 
అదేమయంలో భారత్ విజయానికి యావత్ జట్టు కలిసికట్టుగా కృషి చేయాలని గంభీర్ పిలుపునిచ్చాడు. ముఖ్యంగా, ప్రపంచ కప్‌లలో ఇది చాలా కీలకమన్నారు. టీమిండియాను గెలిపించేది నేను కాదు. 140కోట్ల మంది ప్రజలే భారత్‌ను గెలిపిస్తారు. ప్రతి ఒక్కరూ జట్టు కోసం ప్రార్థిస్తే జట్టంతా కలిసికట్టుగా ఆడితే ఇండియా ప్రపంచ కప్ గెలుస్తుంది అని గంభీర్ వ్యాఖ్యానించారు. ధైర్యంగా ఉండటమే విజయానికి కీలకమని కూడా గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా, 2007, 2011లో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకోవడంలో గంభీర్ కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు