ఢిల్లీ మెట్రో రైల్ రూఫ్‌పై మంటలు... వీడియో వైరల్

ఠాగూర్

మంగళవారం, 28 మే 2024 (14:39 IST)
ఢిల్లీ మెట్రో రైలు రూఫ్‌ టాప్‌పై స్వల్ప స్థాయిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా చిన్నపాటి మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైషాలి ప్రాంతానికి వెళ్లే మెట్రో రైలు సోమవారం సాయంత్రం రాజీవ్ చౌక్ స్టేషన్‌లో ఆగినప్పుడు దాని రూఫ్ పై స్వల్పంగా మంటలు కనిపించాయి. దీంతో ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
 
ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. ఈ ఘటన ప్రమాదకరమైనదేమీ కాదని వివరణ ఇచ్చింది. రైలు రూఫ్ పై వేలాడే విద్యుత్ తీగలు, దాని నుంచి విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించేందుకు ఉండే ఇనుప కడ్డీల పరికరం (పాంటోగ్రాఫ్) మధ్య ఏదైనా చిక్కుకుపోవడమో లేదా ఇరుక్కుపోవడమో జరిగినప్పుడు ఇలా స్వల్ప మంట వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. దీనివల్ల ఎటువంటి భద్రతా ముప్పు లేదా ప్రయాణికులకు ప్రాణాపాయం ఉండదని వెల్లడించింది. అయితే ఇందుకు గల కారణంపై దర్యాప్తు చేపడతామని తెలిపింది.
 
దెబ్బతిన్న పాంటోగ్రాఫ్ తిరిగి విద్యుత్ గ్రహించకుండా నిలిపివేశామని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ చెప్పింది. కేవలం ఐదు నిమిషాల తనిఖీల అనంతరం మిగిలిన పాంటోగ్రాఫ్‌లతోనే రైలు గమ్యస్థానానికి బయలుదేరిందని తెలిపింది. 2002లో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులు ఢిల్లీవాసులకు జీవనాధారంగా మారాయి. ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ మొత్తం 392.44 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్)లో 288 స్టేషన్లు ఉన్నాయి. ఏటా సుమారు 70 కోట్ల మంది ప్రయాణికులను ఢిల్లీ మెట్రో గమ్యస్థానాలకు చేరుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు