టమిండియా కోచ్ పదవికి మోడీ - అమిత్ షా పేర్లతో దరఖాస్తులు!!

ఠాగూర్

మంగళవారం, 28 మే 2024 (16:06 IST)
భారత క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్ నియామకం కోసం భారత క్రికెట్ కంట్రోల్ ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. ఈ గడువు సోమవారంతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి ఏకంగా 3400 దరఖాస్తులు వచ్చినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వీటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఇలా అనేక మంది ప్రముఖుల పేర్లతో నకిలీ దరఖాస్తులు వచ్చాయి. 
 
"దరఖాస్తు ప్రక్రియ పబ్లిక్ డొమైన్ ద్వారా జరగడంతో ఇలా చాలా మంది దరఖాస్తు ఫారమ్‌లను సులభంగా యాక్సెస్ చేయగలరు. ప్రస్తుతం ఇది బీసీసీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఇకపై ఈ విధానం ద్వారా మేం దరఖాస్తులను ఆహ్వానించడానికి బదులు కొత్త ప్రక్రియలతో ముందుకు వస్తాం. ఇది నకిలీ దరఖాస్తులను పూర్తిగా నిలువరిస్తుంది అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. 
 
మరోవైపు, భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ రేసులో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ జట్టుకు గంభీర్ మెంటర్‌గా వ్యవహరించాడు. తనదైన మెంటర్‌‍షిప్‌‍తో జట్టుకు తోడుగా ఉండ ముందుకు నడిపించాడు. దీంతో కేకేఆర్ టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని చివరకు టైటిల్ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో గంభీర్‌ను కొత్త కోచ్‌గా నియమించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు