వచ్చే సీజన్‌లో కూడా ఇలానే రాణించాలి : గిల్‌కు కపిల్ సలహా

బుధవారం, 31 మే 2023 (14:09 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్‌ ముగిసింది. ఈ సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. గుజరాత్ టైటాన్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అయినప్పటికీ అద్భుత ప్రదర్శనతో శెభాష్ అనిపించుకుంది. ఈ జట్టుకు చెందిన యువ క్రికెటర్ శుభమన్ గిల్‌ ఇపుడు వార్తల్లో నిలిచాడు. ఈ సీజన్‌లో అత్యంత నిలకడగా ప్రదర్శన చేసిన బ్యాటర్‌గా గుర్తింపు పొంది, ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఈ క్యాప్ దక్కించుకున్న పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డూ సష్టించాడు. ఈ సీజన్‌లో ఏకంగా 890 పరుగులు ఉండగా, మూడు శతకాలు ఇమిడి ఉన్నాయి. 
 
దీంతో గిల్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా గిల్‌కు అభినందనలు తెలుపుతూనే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ప్రదర్శననే వచ్చే సీజన్‌లోనూ గిల్ ప్రదర్శిస్తే టాప్ బ్యాటర్లతో పోలుస్తానని వ్యాఖ్యానించాడు. అదేసమయంలో గిల్‌లో ఆ తరహా శక్తిసామర్థ్యాలకు కొదవేం లేదన్నారు. 
 
'సునీల్ గావస్కర్, సచిన్‌ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ.. ఇలా ఒక్కొక్కరు తమ బ్యాటింగ్‌లో సత్తా చాటిన ప్లేయర్లు. ఇప్పుడు ఆ జాబితాలోకి శుభ్‌మన్‌ గిల్ కూడా వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వారి అడుగు జాడల్లోనే గిల్ బ్యాటింగ్ ప్రదర్శన ఉంది. అయితే, వారితో గిల్‌ను పోల్చాలంటే మాత్రం వచ్చే సీజన్‌లోనూ ఇలాగే భారీగా పరుగులు చేయాలి. అప్పుడు గొప్ప బ్యాటర్ల లిస్ట్‌లోకి చేరడం ఖాయం. గిల్‌కు ఆ సత్తా ఉంది. అయితే, ఇంకాస్త పరిణతితో ఆడాలి' అని కపిల్ దేవ్‌ వ్యాఖ్యానించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు