సమాకాలీన క్రికెట్‌లో పరుగుల యంత్రంగామారి రికార్డుల రారాజుగా పిలుపించుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రస్తుత క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడంటూ దిగ్గజాలచేత మన్ననలు అందుకుంటున్న కోహ్లి దిగ్గజాల రికార్డులనే చెరిపేస్తున్నాడు. గతేడాది టెస్టుల్లో మూడు ద్విశతకాలు సాధించిన కోహ్లి ఈ ఏడాది మరో ద్విశతకంతో టెస్టులను ఘనంగా ఆరంభించాడు.
గతేడాది మూడు టెస్టు సిరీస్‌ల్లో (వెస్టిండీస్‌పై 200, న్యూజిలాండ్‌పై 211, ఇంగ్లండ్‌పై 235) ద్విశతకాలు సాధించిన కోహ్లి.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లోనూ ద్విశతకం (204) బాదాడు. తద్వారా వరుసగా నాలుగు సిరీస్‌ల్లో ద్విశతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. గతంలో బ్రాడ్‌మన్, ద్రావిడ్ మూడు వరుస సిరీస్‌ల్లో ద్విశతకాలు సాధించారు. బంగ్లాపై ద్విశతకంతో వారి రికార్డును చెరిపేసిన కోహ్లి.. సరికొత్త రికార్డుతో దిగ్గజ ఆటగాళ్లను దాటేశాడు.
ఇదిలావుండగా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేసి అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. వరుసగా మూడు టెస్టు మ్యాచ్‌ల్లో 600పైగా పరుగులు సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. అది కూడా సొంతగడ్డపై. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 687పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అలాగే, 2016 నవంబరు-డిసెంబరులో ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది.
ఈ సిరీస్‌ను భారత్ 4-0తేడాతో దక్కించుకుంది. సిరీస్‌లో భాగంగా ముంబైలో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు 631 పరుగులు చేసింది.ఆ తర్వాత చెన్నైలో జరిగిన ఐదో టెస్టులో అత్యధికంగా 759 పరుగులు చేసింది. వరుసగా మూడు టెస్టు మ్యాచుల్లో 600పైగా పరుగులు నమోదు చేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా, భారత్‌పై వెస్టిండీస్, శ్రీలంకపై భారత్ జట్లు రెండేసి సార్లు 600కి పైగా పరుగులు నమోదు చేశాయి.