హార్దిక్ పాండ్యా ఎడమ కాలికి గాయం.. భారత్‌కు షాక్ తప్పదా?

గురువారం, 19 అక్టోబరు 2023 (22:57 IST)
Hardik Pandya
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. 
 
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌ మూడో బంతిని లిటన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. హార్దిక్ పాండ్యా బంతిని ఆపే క్రమంలో జారిపడ్డాడు. దాంతో అతని ఎడమ కాలి మడమకు తీవ్ర గాయమైంది. 
 
నొప్పితో విలవిలలాడిన హార్దిక్‌కు టీమిండియా ఫిజియోలు ప్రథమ చికిత్స అందించారు. అయినా అతను ఇబ్బంది పడుతుండటంతో బయటకు తీసుకెళ్లారు. దాంతో చివరి మూడు బంతులను విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు. 
 
మూడు బంతులు బౌలింగ్ చేసిన కోహ్లీ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. గంటకు 103 కిలో మీటర్ల వేగంతో కోహ్లీ బౌలింగ్ చేయగా.. బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. 
 
హార్దిక్ పాండ్యా గాయం తీవ్రతపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అతని గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పరిశీలిస్తోందని, స్కానింగ్ కోసం ఆసుపత్రికి కూడా తరలించామని బీసీసీఐ ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు