భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య అత్యంత కీలకమైన రెండో ట్వంటీ20 మ్యాచ్ జరుగనుంది. సిరీస్ లక్ష్యంగా కోహ్లీ సేన బరిలోకి దిగుతుంటే... ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలుపును సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో కివీస్ ఉంది. దీంతో రాజ్‌కోట్ వేదికగా జరిగే ఈ ట్వంటీ20 మ్యాచ్ పోరు నువ్వానేనా అన్న చందంగా సాగనుంది.
ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ టీమిండియా ఓపెనర్లు అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. దీంతో అదే జట్టు బరిలోకి దిగనుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన ఆశిష్ నెహ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నదానిపైనే ఇపుడు ఆసక్తి నెలకొంది. బౌలర్ కావాలనుకుంటే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అలాకాకుండా బ్యాట్స్‌మన్ కావాలనుకుంటే దినేష్ కార్తీక్ లేదా మనిష్ పాండేలలో ఎవరో ఒకరిని జట్టులోకి తీసుకోవచ్చు. టీమిండియా అద్భుతమైన ఫాంలో ఉండగా, ఆటగాళ్లంతా సమష్టిగా రాణిస్తున్నారు.
ఇకపోతే.. కివీస్ జట్టు పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్టిల్ పూర్తిగా విఫలమయ్యాడు. మున్రో కూడా పెద్దగా రాణించింది లేదు. విలియమ్సన్ కూడా విఫలమయ్యాడు. రాస్ టేలర్ కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. దీంతో కివీస్ కష్టాల్లో పడింది. కివీస్ బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో బలంగా ఉంది. కేవలం బ్యాటింగ్ విభాగంగా మాత్రమే తేలిపోతోంది. దీంతో ఈ మ్యాచ్‌తో సత్తా చాటాలని టాప్ ఆర్డర్ భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తిగా మారింది.