కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రకు సంబంధించిన బ్యాంకు లాకరులో 40 కేజీల బంగారం కనిపించింది. ఈ లాకరులో కుప్పలు తెప్పలుగా బంగారు కడ్డీలను చూసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నెవ్వెరపోయారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా అమాయకులను మోసం చేసి భారీగా అక్రమాలు కూడబెట్టారన్న ఆరోపణలపై ఆయనపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈ తాజా సోదాలతో కలిపి, ఈ కేసులో వీరేంద్ర నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ రూ.150 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు. గతంలోనే ఆయన నుంచి 21 కిలోల బంగారు బిస్కెట్లు, నగదు, డిపాజిట్లు, విలాసవంతమైన కార్లతో కలిపి రూ.103 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన విషయం తెలిసిందే.
వీరేంద్ర, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్స్, యాప్‌ల ద్వారా ప్రజలను మోసం చేసి భారీగా డబ్బు సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది. వీరేంద్ర సోదరుడు కేసీ తిప్పేస్వామి, మరో వ్యక్తి పృథ్వీరాజ్‌తో కలిసి దుబాయ్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలను నడిపినట్లు అధికారులు గుర్తించారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై కర్ణాటక విపక్ష నేత అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ ఎన్నికల ఖర్చుల కోసం కాంగ్రెస్ అధిష్టానానికి రూ.300 కోట్లు ఇస్తానని ఎమ్మెల్యే వీరేంద్ర ఆఫర్ చేశారని ఆయన ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని వీరేంద్ర షరతు పెట్టినట్లు తమకు సమాచారం అందిందని అశోక్ పేర్కొన్నారు.