తనకు వచ్చిన ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, వెనెజువెలా ప్రజలకు అంకితమిస్తున్నట్టు పురస్కార విజేత మరియా కొరియా మచాదో ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ చివరకు వెనెజువెలా హక్కుల కార్యకర్త మరియా కొరీనా మచాడోను వరించిన విషయం తెల్సిందే. ఈ మేరకు నోబెల్ కమిటి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
దీనిపై తాజాగా మచాదో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతోపాటు తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం ఇస్తున్నానని పేర్కొన్నారు. వెనిజువెలా ప్రజల లక్ష్యానికి ట్రంప్ నిర్ణయాత్మకంగా మద్దతిచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరియా పోస్టులో వెల్లడించారు. వెనిజువెలా ప్రజల పోరాటానికి దక్కిన ఈ గుర్తింపు తమ కర్తవ్యాన్ని ముగించడానికి ఒక ప్రోత్సాహకమని పేర్కొన్నారు. స్వేచ్ఛ పొందేందుకు దోహదపడుతుందన్నారు. విజయానికి చేరువలో ఉన్నామని పేర్కొన్నారు.
నేడు గతంలో కంటే ఎక్కువగా, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు, ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలను తమ ప్రధాన మిత్రులుగా విశ్వసిస్తున్నామని వివరించారు. అంతకుముందు నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్టియన్ బ్రెగ్ హార్ప్ క్వెన్‌తో ఫోనులో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శాంతి పురస్కారాన్ని ఇవ్వనున్న విషయాన్ని ఆమెకు ముందుగానే తెలియజేశారు.