సెమీస్ మ్యాచ్ నల్లేరుపై నడక కాదు... ఇలా చేస్తేనే గెలుపు : సచిన్

సోమవారం, 8 జులై 2019 (14:48 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, మంగళవారం మధ్యాహ్న మాంచెస్టర్ వేదికగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో భారత్ - న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో భారత్ విజయం నల్లేరుపై నడక వంటిది కాదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. పైగా, ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. 
 
ఇదే అంశంపై సచిన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు భారత క్రికెట్ జట్టు ప్రదర్శన చూసినవారంతా కోహ్లీ సేన ఫైనల్‌కు చేరినట్టేనని భావిస్తున్నారు. ఇలా మాట్లాడుతున్నవారు క్రికెట్‌పై సరిగా అర్థం చేసుకున్నట్టు లేదన్నది తన అభిప్రాయమన్నారు. న్యూజిలాండ్‌తో సెమీస్ మ్యాచ్ భార‌త్‌కు న‌ల్లేరు మీద న‌డ‌క కాదు. చెమ‌టోడ్చి గెల‌వాల్సిందేనని చెప్పారు. 
 
ముఖ్యంగా, లీగ్ ద‌శ‌లో వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో ఓడినంత మాత్రాన‌ న్యూజిలాండ్‌ను తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు. సెమీస్ మ్యాచ్ కాబ‌ట్టి రెండు జ‌ట్ల‌పైనా ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని, మ్యాచ్ రోజు మైదానంలో ఒత్తిడి లేకుండా ఆడేందుకు భార‌త్ ప్ర‌యత్నించాలి. ఒత్తిడిని జ‌యించ‌డంలో కివీస్ ఆట‌గాళ్ల కంటే భార‌త ఆట‌గాళ్లు ముందున్నార‌ని నా అభిప్రాయం. ఇప్ప‌టివ‌ర‌కు ఎలా ఆడారో అదే ఆట‌తీరుకు క‌ట్టుబ‌డి సెమీస్‌లోనూ ఆడాలన్నారు. 
 
ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిస్తే కోహ్లీ తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకోవాలన్నారు. అలాగే, భారత ఓపెనర్లు మరోమారు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని సూచించారు. ఎందుకంటే ఈ పిచ్‌పై 40 ఓవర్ల తర్వాత బ్యాటింగ్ చేయడం కష్టమవుతుందన్నారు. దీనికితోడు దినేష్ కార్తిక్ బ‌దులు రవీంద్ర జడేజాను తీసుకోవాలని, అత‌డి లెఫ్టార్మ్ స్పిన్ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతుందన్నారు. 
 
పైగా, రవీంద్ర జడేజా ఏడో స్థానంలో వేగంగా కూడా ఆడ‌గ‌ల‌డని గుర్తుచేశాడు. ఇక‌, ఇదే ఓల్డ్ ట్రాఫోడ్ పిచ్‌పై వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ అద్భుతంగా బౌలింగ్ చేశాడనీ, శ్రీలంక మ్యాచ్ నుంచి త‌ప్పించిన అత‌ణ్ని మళ్లీ జ‌ట్టులోకి తీసుకోవాలన్నది తన అభిమతమని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు