భారత్ నడ్డి విరిచిన సఫారీ బౌలర్లు.. ఆదుకున్న సూర్యకుమార్

ఆదివారం, 30 అక్టోబరు 2022 (18:14 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలోభాగంగా, ఆదివారం పెర్త్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌‍ ఎంచుకుంది. అయితే, సౌతాఫ్రికా బౌలర్లు భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 
 
ఈ దశలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఆపద్బాంధవ పాత్రను పోషించారు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం క్రీజ్‌లో పాతుకునిపోయి పరుగులు చేశారు. ఫలితంగా వంద పరుగుల మార్క్‌ను భారత్ దాటగలిగింది. 
 
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రాహల్ 9, రోహిత్ శర్మ 15, కోహ్లీ 12, హుడా 0, పాండ్యా 2 ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా 49 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లను కోల్పోయింది. సఫారీ బౌలర్లలో లుంగీ ఎంగిడి నాలుగు వికెట్లు తీశారు. 
 
కానీ సూర్యకుమార్ మాత్రం క్రీజ్‌లో పాతుకునిపోయి 68 పరుగులు చేశాడు. మొత్తం 40 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ 3 సిక్స్‌లు, ఆరు ఫోర్ల సాయంతో ఈ పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. కార్తీక్ 6, అశ్విన్ 7, భువనేశ్వర్ కుమార్ 4 చొప్పున పరుగులు చేయగా షమీ డకౌట్ అయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు